కోటంరెడ్డి కీలక నిర్ణయం…. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక అడుగు వేశారు. ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అపాయింట్ మెంట్ దొరకగానే… నేరుగా వెళ్లి, అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన ప్రకటించారు. బుధవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. తనకు ఇంకా బెదిరింపులు వస్తూనే వున్నాయని, అన్నింటికీ తెగించిన వారే తనతో వున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని, కేసులు తనకు కొత్తకాదన్నారు. తాను దేనికైనా సిద్ధమని, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతానని ప్రకటించారు. తాను ఫోన్ ట్యాపింగ్ విషయం బయట పెట్టే సరికే మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై విమర్శలు చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

 

తనను తిట్లు తిట్టడం కాదని, అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్‌లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లని పూర్తి చేయాలని సూచించారు. పొదలకురు రోడ్డులో 3 కిలోమీటర్లు ఒక పక్కే వేశారని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పొట్టేపాలెం కలుజు వద్ద ప్రమాదాలు జరిగుతున్నాయని, స్వయంగా సీఎం చూసి రూ.28 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారని గుర్తు చేశారు. కానీ… నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. తాను ఆరోపణలు చేసినప్పుడు మీరు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలన్నారు. తనపై శాపనార్దాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని కోటంరెడ్డి పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates