తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బడ్జెట్ అంతా డొల్ల అని, ఎలక్షన్ స్టంట్ అని అన్నారు. శుష్క వాగ్దానాలు- శూన్య హస్తాలేనంటూ విమర్శించారు. ఆత్మస్తుతి పరనింద మాదిరిగా నడించిందని, కేంద్రాన్ని తిట్టడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను వంచించేలా బడ్జెట్ ను రూపొందించారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించామని, ఈసారి కూడా మొండిచేయి చూపించారన్నారు.

 

ప్రతిపాదిత బడ్జెట్ లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ తీరు చూస్తుంటే… మాటలు కోటలు దాటుతున్నాయ్… చేతలు గడప దాటడం లేదనే సామెత గుర్తుకు వస్తోందని బండి సంజయ్ అన్నారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులు వున్నాయన్నారు. లక్షలోపు రైతులకు రుణమాఫీ చేయాలంటే 19,700 కోట్ల నిధులు కావాలి కానీ… ఈ బడ్జెట్ లో 6,285 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. దళిత బంధు పేరుతో ప్రజలను మరోసారి దగా చేశారని బండి సంజయ్ విమర్శించారు.