యువ హీరో అశోక్ గల్లా రెండో సినిమాకి రెడీ అయ్యారు. దీనికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించనున్నారు. పూజా కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి… ఈ సినిమాను ప్రారంభించారు. హీరో వెంకటేష్ క్లాప్ కొట్టగా… నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రఫ్ లుక్‌లో కనిపిస్తా. యాక్షన్ హీరోగా పేరు తీసుకొస్తుంది. ప్రశాంత్‌వర్మ కథనందించడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో తాను చాలా సాఫ్ట్ అని, కానీ.. ఈ సినిమాలో రఫ్ లుక్ లో కనిపిస్తా.. అందరూ అంగీకరించాలని కోరారు.
ప్రేక్షకుల కోసం ఓ మంచి సినిమాను ముందుకు తెచ్చామని, దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించడంతో తమకెంతో నమ్మకం వుందన్నాడు. విభిన్నమైన కథ ఇది. అశోక్ గల్లా పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది. సాయిమాధవ్ బుర్రా మాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని దర్శకుడు తెలిపారు. ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ ‘దాదాపు నాలుగేళ్లు ఈ కథపై పనిచేశా. చక్కటి వినోదంతో మెప్పిస్తుంది. అశోక్ గల్లా కంప్లీట్ మేకోవర్‌తో కనిపిస్తారు’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ: ప్రశాంత్‌వర్మ, సమర్పణ: నల్లపనేని యామిని, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల.













