తెలంగాణకి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సినవి, చేయాల్సి న అంశాల్లో కేంద్రం పక్కాగా సహకారం అందిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి వెళ్లే డబ్బులు తిరిగి రావడం లేదంటూ కొందరు ప్రజా ప్రతినిధులు కేంద్రాన్ని నిందిస్తున్నారని, దేశమన్న సమగ్ర స్వరూపం నేపథ్యంలో రాష్ట్రాలను ఎలా చూసుకోవాలో కేంద్రానికి తెలుసని వ్యాఖ్యానించారు. గవర్నర్ తమిళిసై చేసిన బడ్జెట్ ప్రసంగంపై అసెంబ్లీలో మాట్లాడుతూ… పై వ్యాఖ్యలు చేశారు. అయితే… ఇక్కడ విపక్ష పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాలకు కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా నిధులివ్వడం లేదని ఆరోపించారు. స్పెషల్ డెవలెప్మెంట్ స్కీం కింద గజ్వేల్ కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790కోట్ల నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్.. దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రానికి సహకరిస్తుంది కాబట్టే.. గవర్నర్ ప్రసంగంలో కేంద్రాన్ని విమర్శించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అధికార పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని హితవుపలికారు. గతంలోనే తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, కాబట్టి లేని చోట పెట్టాలన్నదే మోదీ ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. దేశంలో వున్న ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాల తీసుకురావాలని, ఫలితంగా అన్ని ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలని కేంద్రం ఓ విధానాన్ని తీసుకొచ్చిందని వివరించారు.
గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. 9 ఏళ్లు గడుస్తున్నా… రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయడం లేదని విమర్శించారు. గుడిసెలు లేని తెలంగాణను చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్ లో యేడాదిలోనే లక్ష డబుల్ బెడ్రూములు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడంలేదని ఆరోపించారు. వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని బద్నాం చేస్తోందని, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని రఘునందన్ స్పష్టం చేశారు.