ప్రముఖ గాయని వాణీ జయరామ్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఒక రోజు ముందే కళాతపస్వీ విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే వాణి జయరాం మరణంతో సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. తెలుగు, తమిళంతో సహా వివిధ భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం తన గాత్రాన్ని అందించారు. ఆమె చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం వాణీ జయరాంకి ఇటీవలే పద్మభూషణ్ ప్రకటించింది.

అయితే… ఈ అవార్డును అందుకోక ముందే.. గాయని కన్నుమూశారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30 న వాణీజయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెల్లలో వాణీ జయరాం ఐదో సంతానం. కర్నాటక సంగీతాన్ని బాగా ఔపోసన పట్టారు. దీక్షితార్ కీర్తనలు బాగా పాడేవారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్ పురీ… ఇలా 14 భాషల్లో దాదాపు 20 వేలకు పైగా పాటలు ఆలపించారు.












