లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్‌ని అందించనున్నట్లు తెలిపింది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది. శాండోస్ (Sandoz) కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమై ఈ మేరకు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది.

ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది.  ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లాబోరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

 

హైదరాబాద్ కేంద్రంగా శాండోస్ కంపెనీ తన గ్లోబల్ క్యాప‌బిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార అనుకూలత, అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్ సైన్సెస్ రంగం మరింతగా వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, శాండోస్ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించారు. హైదరాబాద్ నగరంలోనే ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్ తన రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కలిగి ఉందని, ఇదే స్థాయిలో శాండోస్ కంపెనీ కూడా హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను విస్తరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.