విశాఖ పట్నమే ఏపీ రాజధాని కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను కూడా విశాఖకే షిఫ్ట్ అవుతున్నానని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చిలో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు రావాలని ఆహ్వానించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. వరుసగా మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. పారిశ్రామిక వేత్తల నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈర్యాంకులు ఇచ్చారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందకు తమ వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందుతాయని సీఎం హామీ ఇచ్చారు.
ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి సహాయ సహకారాలు చాలా కావాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులే వున్నాయని ఇన్వెస్టర్లకు సీఎం జగన్ వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతముందని, 11.43 శాతం వ్రుద్ధి రేటుతో దేశంలోనే వేగంగా డెవలప్ అవుతున్నామని సీఎం జగన్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్ లో ఒక్క ఏపీకే 3 కారిడార్లు వచ్చాయన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లో ఉందని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే మార్చి మొదటి వారంలో గ్లోబల్ ఇన్వెస్ట్ మీట్ విశాఖ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. విశాఖ నగరాన్ని వచ్చిన ఇన్వెస్టర్లందరికీ విశాఖపట్టణం ప్రాంతాలను చూపించి పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ఉందని వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే చాలా మంది మంత్రులు విశాఖే రాజధాని అని చాలా సార్లు ప్రకటించారు. అందులో అనుమానాలు అవసరం లేదని కూడా స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సీఎం జగనే ఈ విషయాన్ని ప్రకటించారు.












