గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి మంగళ్ హాట్ పోలీసులు మళ్లీ నోటీసులిచ్చారు. హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 29 న ముంబైలోని దాదర్ లో జరిగిన ర్యాలీలో రాజాసింగ్ ప్రసంగించారు. ఆ ర్యాలీలోనే రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు.. ఈ నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. గోహత్య, మత మార్పిడులు, లవ్ జిహాద్ అంశాలపై చట్టం చేయాలని కోరానని, ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం వున్నాయని సూటిగా ప్రశ్నించారు.

నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుతుకున్నారని, పోలీసులు నోటీసులిచ్చినా, జైలుకు పంపినా.. భయపడనని రాజాసింగ్ స్పష్టం చేశారు. తాను మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే మాటలు కాదని, అయినా… పోలీసులు తనపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగానే వుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ధర్మం కోసం పనిచేయటమే నా లక్ష్యం అని దాని కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను ముంబైలో మాట్లాడితే.. మంగళ్ హట్ పోలీసులు నోటీసులివ్వడం ఏంటని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు.

 

సీఎం కేసీఆర్ ప్రభుత్వం తన ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు. కొన్ని రోజుల క్రిందటే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మళ్లీ మొరాయించింది. ఈ నేపథ్యంలోనే పై వ్యాఖ్యలు చేశారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారని, తనను మాత్రం పాత వాహనంతోనే సరిపెట్టుకోవాలని అంటున్నారన్నారని మండిపడ్డారు. రాజాసింగ్‌ తన బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా పురానాపూల్‌ సర్కిల్లో ఆగిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఇదే సమస్య ఎదురవుతోందన్నారు. ఇప్పటికీ ఐదుసార్లు రోడ్డు మధ్యలో తన వాహనం ఆగిపోయిందన్నారు. అవసరం లేని వారికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను ఈ ప్రభుత్వం సమకూరుస్తోందని ఆరోపించారు.