ఎట్టకేలకు బడ్జెట్ లో గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో వెనక్కి తగ్గింది. గవర్నర్ తో సయోధ్యకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ న్యాయవాదుల మధ్య రాజీ కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్ భవన్ కి వెళ్లారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన లాంఛనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మనోగతాన్ని గవర్నర్ ముందు వుంచారు. ఈ భేటీ తర్వాతే బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగుమమైంది.
2023-2024 బడ్జెట్ కు గవర్నర్ నుంచి ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. దీనికి ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఓకే చెప్పింది. దీంతో సీఎస్ శాంతి కుమారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం పక్షాన సుప్రీం కోర్టు న్యాయవాది దుష్యంత్ దవే, అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రరావు వాదనలు వినిపించగా, గవర్నర్ పక్షాన సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద కుమార్ వాదనలు వినిపించారు.

ఫిబ్రవరి 3 న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని, ఈ గడువు దగ్గర పడుతున్నా… బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం రాలేదని ప్రభుత్వం హైకోర్టులో పేర్కొంది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలంటూ, ఈ నెల 21 న గవర్నర్ కి లేఖ రాశామని, ఇప్పటి వరకూ ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొంది. వెంటనే అనుమతి ఇచ్చేలా రాజ్ భవన్ కు ఆదేశాలివ్వాలని ప్రభుత్వం పక్షాన న్యాయవాది తన వాదనలు వినిపించారు.
గవర్నర్ విధుల్లోకి మమ్మల్ని లాగుతున్నారు ఎందుకు?
ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ విధుల్లోకి తమను ఎందుకు లాగుతున్నారని ప్రభుత్వం పక్షాన వాదించిన న్యాయవాదిని ప్రశ్నించింది. దీనిపై తామెలా విచారణ చేపట్టగలమని ధర్మాసనం ప్రశ్నించింది. గవర్నర్ విధుల్లోకి తాము ఎలా జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది.కోర్టులు అతిగా జోక్యం చేసుకుంటున్నాయని మీరే చెప్తుంటారు కదా? అంటూ సూటిగా ప్రశ్నించింది. అయితే… దీనిపై సుప్రీం కోర్టు న్యాయవాది దుష్యంత్ దవే తన వాదనలు వినిపించారు. న్యాయ సమీక్షకు అవకాశం వుందని, షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టతనిచ్చిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు అందరికీ శిరోధార్యమే అని తన వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని అధికరణ 200 ప్రకారం ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి వుందన్నారు.
అయితే.. రాజ్ భవన్ పక్షాన సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద కుమార్ తన వాదనలు వినిపించారు. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ నాయకుడు చాలా అనుచితంగా వ్యాఖ్యలు కూడా చేశారన్నారు. బడ్జెట్ ఫైల్ పంపాలని గవర్నర్ కోరినా.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటి వరకూ స్పందన లేదన్నారు. గవర్నర్ ప్రసంగం వుంటుందా? వుండదా? అనేది కూడా చెప్పడం లేదన్నారు. గత యేడాది కూడా గవర్నర్ ప్రసంగం లేదని, గణతంత్ర వేడుకలకు సీఎం హాజరుకాలేదని గుర్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధర్మాసనం ముందుంచారు.