ప్రజల ఆశీస్సులతో యాత్ర విజయవంతం.. రాహుల్ గాంధీ

ప్రజల ఆశీస్సులతో తన పాదయాత్ర విజయవంతమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన భారత్ జోడో యాత్రకు రాహుల్ ముగింపు పలికారు. ఓ పక్క భారీగా మంచు కురుస్తున్నా శ్రీనగర్లో భారత్ జోడో యాత్ర ముగింపు సభ సాగింది. ముగింపు సభలో భాగంగా జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్లో లాల్చౌక్లో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ జోడో యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎండ తగలలేదని, ఇప్పుడు మంచు కురుస్తున్నా చలివేయడం లేదన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు దేశ ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయన్నారు. మొదట్లో నేను రోజుకు 8 నుంచి 9 కిలోమీటర్లు నడుస్తానేమో అనుకున్నా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్ర కొనసాగించామన్నారు.

ఈ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.  ప్రజల సహకారం చూసి నాకు కళ్ల వెంట నీరు వచ్చింది. ఒక దశలో యాత్ర పూర్తి చేయగలనా అనుకున్నా,  చలిని లెక్క చేయకుండా ప్రజలు సభకు హాజరయ్యారు. వారి సహకారం లేకుండా ఏ పనీ సాకారం కాదు. పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలు , మహిళలు తమ బాధలు నాతో పంచుకున్నారు. ఈ పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పింది. ప్రజల దీనస్థితి చూసే టీషర్టు తోనే యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్రను గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 145 రోజులపాటు మొత్తం 4 వేల కిలోమీటర్లకు పైగా రాహుల్ నడిచారు. ఈ ముగింపు సభలో ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేతోపాటు కశ్మీరీ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates