దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 74 వ గణతంత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ ప్రయాణం ఇతర దేశాలకు ఎంతో స్ఫూర్తి దాయకమని అన్నారు. 74 వ గణతంత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. భారత దేశ ప్రయాణాన్ని చూసి ప్రతి భారతీయుడూ గర్వించాలన్నారు. భారత దేశం ప్రజాస్వామ్య రిపబ్లిక్ గా విజయం సాధించిందన్నారు. భారత్ లో వివిధ మతాలు, భాషలు వున్నా… అవేవీ ప్రజలను విడదీయలేదని, అందర్నీ ఏకం చేశాయని పేర్కొన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి భారత్ ప్రయాణం అందరికీ ప్రేరణనిస్తోందన్నారు. ప్రజాస్వామ్య అమలులో భారత్ అమ్మ లాంటిదని కొనియాడారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో దేశం లెక్కలేనన్ని సవాళ్లను, ప్రతికూలతలను ఎదుర్కొందన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఇప్పుడు ఓ మైలురాయిని చేరుకున్నామని వివరించారు. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా, భారత్ మాత్రం తన ఆత్మను ఎక్కడా కోల్పోలేదన్నారు. ఆశ, విశ్వాసం అన్న పదాలతో భారత్ జీవనయానం చేస్తోందని తెలిపారు.

జీ 20 అనేది ప్రజాస్వామ్యాన్ని, బహుళత్వాన్ని ప్రోత్సహించే సరైన వేదిక అని రాష్ట్రపతి అభివర్ణించారు. ప్రపంచానికి ఓ మెరుగైన భవిష్యత్తును అందించే సరైన వేదికగా పేర్కొన్నారు. భారత్ నాయకత్వంలో జీ 20 మరింత స్థిరమైన ప్రపంచ క్రమాన్ని నిర్మించడానికి ఉపయోగకారిగా వుంటుందని పేర్కొన్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి అని, ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర భారత్ ప్రజలలో గొప్ప స్పందనను రేకెత్తించిందన్నారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన నిర్దిష్ట ప్రోత్సాహక పథకాలు కూడా ఉపయోగపడ్డాయని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.












