టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి ఏపీలో యువగళం పేరుతో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. అంతకు ముందే నారా లోకేశ్ తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ఆశీస్సులు తీసుకున్నారు. భార్య నారా బ్రాహ్మణి హారతిచ్చారు. అత్త మామలు బాలకృష్ణ, వసుంధర ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి, నివాళులర్పించారు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కడప బయల్దేరారు.

కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు. తర్వాత పెద్ద దర్గా చేరుకొని, ప్రత్యేక చాదర్ ను సమర్పిస్తారు. అనంతరం మరియాపురంలోని రోమన్ కేథలిక్ చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తారు. కడప నుంచి రాజంపేట, రైల్వే కోడూరు మీదుగా రాత్రి తిరుమలకు చేరుకోనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుప్పంలోని వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి, అరాచక సర్కార్‌తో పోరాడటానికి సారధిగా వస్తున్నానన్నారు. యువతకు భవితనవుతా.. అభివృద్ధికి వారధిగా నిలుస్తానన్నారు. రైతన్నను రాజుగా చూసేవరకూ విశ్రమించేది లేదని, మీరే ఒక దళమై, బలమై తన యువగళం యాత్రను నడిపించండి అంటూ లోకేష్ బహిరంగ లేఖ రాశారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని, వైసీపీ బాదుడే బాదుడు పాలనలో బాధితులు కాని వారు లేరని అన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను వైసీపీ నేతలు హరించారని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు.












