భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 13 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి డీజీ అనిల్ కుమార్, 12 వ బెటాలియన్ అదనపు కమాండెంట్ రామకృష్ణ, ఏపీ నుంచి డీజీ అతుల్ సింగ్, 6 వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటరావు రాష్ట్రపతి పతకాలు అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా 901 మంది పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ ప్రకటించారు. 140 మందికి శౌర్య పతకం, 93 మందికి విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పతకం, 668 మందికి మెరిటోరియస్ సర్వీస్ అందించినందుకు పోలీసు పతకం లభించాయి.
140 గ్యాలంట్రీ అవార్డులలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుంచి 80 మంది సిబ్బంది, జమ్మూ-కాశ్మీర్ కు చెందిన 45 మంది సిబ్బంది అవార్డులకు ఎంపికయ్యారు.మహారాష్ట్ర నుంచి 31 మందికి, జమ్మూ కశ్మీర్ నుంచి 25 మందికి, జార్ఖండ్ నుంచి 9 మంది, ఢిల్లీ నుంచి 7, ఛత్తీస్ గఢ్ నుంచి ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి. అయితే.. ఈ సారి అత్యున్నత రాష్ట్రపతి పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ పురస్కారాన్ని పోలీసు దళాల్లో ఎవ్వరికీ ఇవ్వలేదు. 140 గ్యాలంట్రీ అవార్డులో ఎక్కువ భాగం లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పని చేసిన అధికారులు ఉన్నారు. 80 మంది జమ్మూకాశ్మీర్ పోలీస్ సిబ్బంది. 45 మందికి సాహసోపేతమైన విభాగంలో అవార్డులు అందించనుంది. గ్యాలంట్రీ అవార్డులో 48 మంది సీఆర్పీఎఫ్, 31 మంది మహారాష్ట్ర అధికారులు ఉన్నారు.