తిరుమల తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ పై కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన విరాళాల వివరాలను ఆయన బహిర్గతం చేశారు. శ్రీవాణి నిధులను ప్రభుత్వానికి గానీ, ఇతర సంస్థలకు గానీ ఇవ్వడం లేదని ప్రకటించారు. ట్రస్టు నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న పుకార్లను ఖండించారు. ఇప్పటి వరకూ శ్రీవాణి ట్రస్టుకు 650 కోట్లు వచ్చాయని, నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు తెలంగాణ, కర్నాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో 2,068 ఆలయాలను సమరసత ఫౌండేషన్ తో కలిసి నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం శ్రీవాణి నిధులు, సమరసత ఫౌండేషన్ తో కలిసి టీటీడీ 320 ఆలయాల నిర్మాణానికి 32 కోట్లు, దేవాదాయ శాఖతో కలిసి 932 ఆలయాల నిర్మాణానికి 100 కోట్లకు గాను 25 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇక… ఆలయాల జీర్ణోద్ధరణ కింద 150 దేవాలయాలకు 130 కోట్లకు గాను 71 కోట్లు మంజూరు చేశామన్నారు.
ట్రస్టు నిధులతో నిర్మించిన ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం, అర్చకులకు కలిపి ప్రతి ఆలయానికి 5 వేల చొప్పున 12.50 కోట్లను మంజూరు చేశామన్నారు. బీసీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో నిర్మించిన ఆలయాల ధూప, దీప నైవేద్య నిర్వహణకు 2 వేలు ప్రతి ఆలయ ట్రస్టుకు ఇస్తున్నామన్నారు. తిరుమలలో సాధారణ భక్తుల సౌకర్యార్థం గదుల నిర్వహణకు చేస్తున్న ఖర్చే ఏడాదికి 110 కోట్లు అని, వస్తున్న ఆదాయం మాత్రం 71 కోట్లు మాత్రమేనన్నారు. 2019 లో 13,025 కోట్లున్న దేవస్థానం నగదు డిపాజిట్లు ప్రస్తుతం 15,938 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. బంగారం నిల్వలు 7,399 కేజీల నుంచి 10,258 కేజీలకు పెరిగిందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అన్న వార్తలను ఖండిస్తున్నానని ఈవో ధర్మారెడ్డి అన్నారు.