జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కొండగట్టుకు బయల్దేరారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి ఆంజనేయ స్వామి దేవ స్థానంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. అక్కడి అర్చకులు వారాహికి పూజలు చేస్తారు. అయితే.. పవన్ వారాహి వాహనం మాత్రం నిన్న రాత్రే కొండగట్టుకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి జనసేనాని బయల్దేరారు. ముందుగా అంజన్న స్వామిని దర్శించుకుంటారు. తర్వాత వారాహి ప్రచార రథానికి వాహన పూజ జరిపిస్తారు. అక్కడి నుంచి.2 గంటలకు కొడిమ్యాల (మం) నాచుపల్లి వెళ్లి జనసేన ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.సాయంత్రం 4.గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అన్స్టాప్ నారసింహ యాత్ర పేరుతో ధర్మపురి క్షేత్రాన్ని దర్శించనున్నారు.

ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడుతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. జనసేనాని వస్తున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన పార్టీని 2009లో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న తర్వాత పవన్ ప్రారంభించారు. దీంతో పవన్ సెంటిమెంట్‌గా భావించే ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలోని కొండగట్టు అంజన్నక్షేత్రంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
కొండగట్టులోనే ఎందుకంటే…
మెగాస్టార్ సారథ్యంలోని ప్రజారాజ్యం సమయంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాన్ పనిచేశారు. అప్పట్లో కొండగట్టు పర్యటనకు పవన్ వచ్చారు. అప్పుడే పెను ప్రమాదం తప్పింది. పవన్ కల్యాణ్ తన వాహనంపై నిల్చుని ప్రసంగిస్తుండగా.. కరెంట్ తీగలు తగిలాయి. పక్కనున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. పవన్ కల్యాణ్ కి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఆంజనేయ స్వామి దయతోనే ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని పవన్ చాలా సార్లు చెప్పారు. అందుకే… సెంటిమెంట్ గా కొండగట్టును ఎంచుకున్నారు.