మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ సంచలన విషయాన్ని బయటపెట్టారు. గవర్నర్ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నానని, తనను తప్పించాలంటూ ప్రధాని మోదీని కోరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ ఓ ట్వీట్ చేసింది. కొన్ని రోజుల క్రిందట ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలోనే ఆయనతోనే ఈ ప్రతిపాదన గురించి చర్చించానని, ప్రధాని మోదీకి ఈ విషయం చెప్పానని పేర్కొన్నారు. అయితే… మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి సేవలందించడం ఎంతో గర్వంగా వుందన్నారు. సంతులు, సాధువులు, సంఘ సంస్కర్తలు పుట్టిన గడ్డ మహారాష్ట్ర అని, అలాంటి గొప్ప రాష్ట్రానికి సేవకుడిగా వున్నానన్నారు. ఈ 3 సంవత్సరాలలో మహారాష్ట్ర ప్రజలు చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనన్నారు. అయితే.. తన శేష జీవితాన్ని పుస్తకాలు చదవడం, రాయడంతో గడిపేస్తానని, ప్రధాని మోదీ దీనిపై త్వరగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర గవర్నర్ కోషియారీ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. శివాజీ మహారాజ్ పాతతరం నాయకుడని, గడ్కరీని ఆదర్శంగా తీసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేపాయి. అయితే.. దీనిపై గడ్కరీ వివరణ ఇచ్చుకున్నారు. తమకు శివాజీ దేవుడు లాంటివారంటూ పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ని రాత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఘటన కూడా చాలా కాక రేపింది.












