తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. దీంతో… ఈ వివాదం తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఇన్ స్టాగ్రామ్ రీల్ హైదరాబాద్ కి చెందిన సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసిన విషయాన్ని తాము గుర్తించామని టీటీడీ ఈవో వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రకటించారు. డ్రోన్ రైడర్ 1 అనే యూట్యూబ్ ఛానల్ లో 13 నవంబర్ 2022 లో వీడియో అప్ లోడ్ అయినట్లు తెలుస్తోంది. అదే వీడియోని మళ్లీ ఐకాన్ ఫాక్ట్స్ ఐకాన్ అనే యూట్యూబ్ ఛానెల్ లో జనవరి 7, 2023 లో పోస్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు.
ఇక… శ్రీవారి ఆలయం పై భాగంలో గానీ, పరిసరాల్లో గానీ విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు అనుమతులు లేవు. ఆగమ సలహా మండలి సూచన మేరకు కూడా ఆలయంపై విమానాలు, డ్రోన్లు నిషేధం అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇలా డ్రోన్ల ద్వారా తీసిన వారిని టీటీడీ విజిలెన్స్ పోలీసులు గుర్తించారని, దర్యాప్తుకు కూడా ఆదేశించామన్నారు. చిత్రీకరించింది వీడియోనా, లేక పాత చిత్రాలతో త్రీడీ లాగా రూపొందిచారా? అన్న దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్ కి టెస్టింగ్ కోసం పంపామని ప్రకటించారు. రాబోయే ఐదు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.












