ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రక్రియ మొత్తాన్ని చాలా పారదర్శకంగా నిర్వహించాలని, షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని మంత్రి సబితా అధికారులకు సూచించారు. ఈ నెల 27 నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించి, మార్చి 4 వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. మొత్తం 37 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో జనవరి ఒకటో తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తయితేనే బదిలీకి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
ఈసారి కలెక్టర్లు కన్వీకనర్లుగా…
టీచర్ల బదిలీలు, పదోన్నతులపై తెలంగాణ ప్రభుత్వం చాలా దీర్ఘంగా కసరత్తు చేస్తోంది. ఎలాంటి విమర్శలు రాకుండా వుండాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతానికి భిన్నంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ కన్వీనర్ గా, జిల్లా పరిషత్ చైర్మన్, సీఈవో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో వున్నారు. గతంలో బదిలీల సమయంలో అనేక తల నొప్పులు వచ్చాయని, అందుకే ఐఏఎస్ లకు బాధ్యత అప్పగిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రావన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.