దాదాపు ఏడాది తర్వాత కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ కి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాకరే పిలిచినందుకే తాను గాంధీ భవన్ కి వచ్చానని వివరణ ఇచ్చుకున్నారు. అటు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు థాక్రేతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో అందరికీ గౌరవం దక్కాలని, సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా జరిగితేనే అందరూ ఉత్సాహంతో పనిచేస్తారని, లేదంటే.. ఎవరి దారిన వారు వెళ్తారన్నారు. కేసీఆర్ ఏ సమయంలోనైనా ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ వుందని అన్నారు.

తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ మీద ప్రేమ, విశ్వాసం వుందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు అందరూ పనిచేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. అయితే… ఎన్నికలకు 6 నెలల ముందు 50 శాతం టిక్కెట్లు ఖరారు చేయాలని తాను ఈ సమావేశంలో సూచించానని వెల్లడించారు. రుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని వివరించానన్నారు. ఇన్‌ఛార్జి కూడా జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టాలని సూచించానని, అందుకు థాక్రే అంగీకరించారని చెప్పారు. వీటితో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు వివరించారు.