విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ పనులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విగ్రహం తయారీ, దాని చుట్టూ చేపట్టిన సివిల్ వర్క్, సుందీకరణ, తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు కూడా చేశారు. మొత్తంగా అంబేద్కర్ విగ్రహం 206 అడుగులు పొడవు వస్తుందని అధికారులు సీఎంకి వివరించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా 268 కోట్లు కాగా, పీఠం భాగంలో G+2 నిర్మాణం వుంటుంది. అలాగే కన్వెన్షన్ సెంటర్ కూడా వుంటుంది. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నారు. మార్చి నెలాఖరు కల్లా విగ్రహ పనులు పూర్తి చేస్తామని అధికారులు జగన్ కి వివరించారు.













