ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ బృందం.. బంగారు ప్రతిమను తయారు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం, దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషిని పురస్కరించుకుని.. 156 గ్రాముల బరువున్న మోదీ బంగారు విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు. ఈ విగ్రహాన్ని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశామన్నారు. ఈ బంగారు విగ్రహాన్ని రూపొందించేందుకు 11 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని చెప్పారు. దీనిని తయారు చేసేందుకు తమ బృందంలోని దాదాపు 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించారని సందీప్‌జైన్ పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మరుక్షణం మోదీ ప్రతిమను తయారు చేసే పని ప్రారంభించినట్లు సందీప్ జైన్ చెప్పారు. త్వరలోనే ప్రధానిని కలిసి దీనిని ఆయనకు బహూకరించనున్నట్లు వివరించారు.












