ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలంగాణ ఐటీ మంత్రి కే. తారక రామారావు ప్రకటించారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందన్నారు. త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్ ను డబ్ల్యూహెచ్ వో ఏర్పాటు చేయబోతోందన్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే కేటీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం అసలు శక్తి సామర్థ్యాలు ఇంకా పూర్తిస్థాయిలో బయటకురాలేదని అన్నారు. సైన్స్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఎన్నో సమస్యలకు సులువైన పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. మెరుగైన, కచ్చితమైన ఔషధాల తయారీతోపాటు ఆరోగ్య సంరక్షణలో మరిన్ని సురక్షిత పద్ధతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
కొవిడ్ మనకు ఎన్నో విషయాలు నేర్పిందని అన్నారు. వైద్యరంగంలో ఉన్న మౌలిక సదుపాయాల లోపాలు కొవిడ్‌తో బయటపడ్డాయని గుర్తుచేశారు. ఇదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఔషధాలు, వ్యాక్సిన్ల అనుమతులను వేగవంతం చేసిన సంగతిని ప్రస్తావించారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచం లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాలపై దృష్టి పెడుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక వేదికతో తెలంగాణ ప్రభుత్వం చేతులు కలిపిందని చెప్పారు.