ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ అల్లర్లపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీని అపఖ్యాతి పాలు చేసేందుకే ఇలాంటి కథనాలను ప్రసారం చేస్తున్నారని, ఆ డాక్యుమెంటరీకి ఏమాత్రం విశ్వసనీయత లేదని భారత ప్రభుత్వం ఎద్దేవా చేసింది. ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, వలసవాద ఆలోచనా ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోందని కేంద్రం దుయ్యబట్టింది. ఈ విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడారు. బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని బాగ్చి అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో దీనిని ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు. అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన మనం ఇప్పుడు ఎందుకు స్పందించాలని అడిగారు. జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు. మనం పదాలను ఇష్టానుసారం వాడబోమని స్పష్టం చేశారు.












