కర్నాటక ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా.. వాటిని నిరూపించేందుకు కూడా సిద్ధమేనంటూ సవాల్ చేయడంతో మరింత ఘాటుగా ఈ వ్యవహారం మారింది. కర్నాటక కాంగ్రెస్ కి చెందిన ఓ కీలక నేతను సీఎం కేసీఆర్ లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడని, 500 కోట్లను కూడా ఆఫర్ చేశారని రేవంత్ సంచలన ఆరోపణలకు తెరలేపారు. కాంగ్రెస్ బలహీనంగా వున్న 30 స్థానాల్లో పార్టీ పరాజయం కోసం పనిచేయాలని, కాంగ్రెస్ కి చెందిన ఓ కీలక నేతకు 500 కోట్లు కేసీఆర్ ఆఫర్ చేశారన్నారు. ఈ డీల్ ఫామ్ హౌజ్ లో జరిగిందని, ఇది నిజమా? కాదా? అని ఆయన నిలదీశారు. ఇది ఆరోపణ మాత్రం కాదని, ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని అన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ 130 సీట్లు గెలుస్తుందని, ఓ 30 సీట్లలో కాంగ్రెస్ బలహీనంగా వుందన్న రిపోర్ట్ కూడా వచ్చిందని రేవంత్ వెల్లడించారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇప్పటికే కర్నాటకకు చేరుకున్నారని, కాంగ్రెస్ మద్దతుదారులు, ఓటు వేసే వారి వివరాలు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ తెలిసే… జేడీఎస్ అధినేత కుమార స్వామి ఖమ్మం సభకి రాలేదన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కేసీఆర్ గుజరాత్ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. బీజేపీపై కొట్లాడుతామంటున్న కేసీఆర్ కాంగ్రెస్ పై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీ దుర్మార్గాల్లో కేసీఆర్ భాగస్వామ్యం లేదా అని రేవంత్ నిలదీశారు.