తెలంగాణ వైద్య మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని అమీర్ పేటలో కంటి వెలుగు పరీక్షలను ప్రారంభించారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నుంచి సీఎం కేసీఆర్, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అఖిలేశ్ యాదవ్ ఈ కంటి వెలుగును ప్రారంభించారు. అయితే… నేటి నుంచి కంటి వెలుగు పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిటీలో 115 చోట్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో 827 ఉండే కంటి వెలుగు బృందాలు.. ఇప్పుడు 1500 లకు పెంచామని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నగరంలోని గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ లు కాలనీల్లోనే కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ట్వీటర్ లో ట్వీట్ చేస్తే మీ దగ్గరకే వచ్చి కంటి పరీక్షలు చేస్తారన్నారు. ప్రజల వద్దకే వెళ్లి, సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గతంలో 8 నెలల్లోనే మొదటి విడత పూర్తి చేశామన్నారు. ఇప్పుడు 100 రోజుల్లో 2 వ విడత కంటి వెలుగును నిర్వహిస్తున్నట్లు వివరించారు. కాలనీల్లోకే కంటి వెలుగు ప్రతినిధులు వస్తారని, చివరి మనిషి వరకూ కంటి వెలుగు పరీక్షలు చేస్తామన్నారు.
ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలని, ప్రతినిధులే ఇంటికి వచ్చి, పరీక్షలు చేస్తారని హరీశ్ కీలక ప్రకటన చేశారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మినహాయిస్తే.. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కంటి పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం 1500 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్‌లో 8 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు. అవసరమైనవారికి కళ్లద్దాలు, మందులు అందజేస్తామన్నారు.