న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు. ప్రధాని పదవి నుంచి దిగిపోడానికి ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నానని లేబర్ పార్టీ సమావేశంలో ప్రకటించారు. 2017లో జెసిండా ఆర్డెర్న్ తొలిసారిగా న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మూడేండ్ల తర్వాత 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో లేబర్ పార్టీ సాధారణ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే అనుకున్నంతగా రాణించలేకపోయింది.
లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ 14న జరుగుతాయని తెలిపారు. దీంతో ఆర్డెర్న్ పదవీ కాలం ఫిబ్రవరి 7 తర్వాత ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.జెసిండా ఆర్డెర్న్ 37 ఏళ్లకే ప్రధాని పదవి చేపట్టి ప్రపంచంలోని అత్యంత పిన్నవయస్కురాలైన దేశాధినేతగా పేరొందారు. పదవితో లభించే హోదాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని, వాటిని నెరవేర్చలేని పక్షంలో కొనసాగడం తగదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఆమె పదవి చేపట్టినప్పటి నుండి దేశం తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటు వస్తున్నది.