తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ, పంజాబ్ లోనూ అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేజ్రీవాల్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ మా అందరికీ పెద్దన్న లాంటి వారని ప్రకటించారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఓ అద్భుతమని, ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

 

ఢిల్లీలో ప్రతి గల్లీలోనూ మొహల్లా ఆస్పత్రులు వున్నాయని, అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ గవర్నర్ సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్గుతగలడమే గవర్నర్ల పని అన్నట్లు ఉందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.