దావోస్ వేదికగా జరుగుతున్న ఎకనమిక్ ఫోరం అంతర్జాతీయ సదస్సుకు ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదన్న టీడీపీ విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. ఈ సదస్సులో పాల్గొనాలని ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానాలు అందాయని పరిశ్రమలు, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. గతేడాది నవంబర్ 25 న సీఎం జగన్ కి, ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానాలు అందాయని, టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సదస్సు ప్రతినిధులు ఏపీ ప్రభుత్వానికి పంపిన ఆహ్వానాన్ని మీడియాకి చూపించారు. దీనిపై చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ఏపీ ప్రభుత్వం సదస్సు ఏర్పాటు చేస్తోందని, అందుకే దావోస్ వెళ్లలేదని ప్రకటించారు. ఐదు సార్లు దావోస్ వెళ్లిన చంద్రబాబు ఏపీకి ఏం తెచ్చారని మంత్రి అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు.












