కాంగ్రెస్ నేత వరుణ్ గాంధీ బీజేపీని విడిచి, కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఈ మధ్య విపరీతంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దీనిపై ఒకింత ఘాటుగా స్పందించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ భావజాలం, తన భావజాలం పూర్తిగా విరుద్ధమన్నారు. తాను ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లే ప్రసక్తే లేదని, అది జరగాలంటే తల తెగిపోవాలంటూ సంచలన వ్యాఖ్యలకు దిగారు.
”వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నారు. ఆయన ఇక్కడికి వస్తే, ఆయనకు అదొక సమస్య కావచ్చు. ఆయన భావజాలంతో నా భావజాలం సరిపోలదు. నేను ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లను. అది జరగాలంటే అంతకుముందే నా తల తెగిపడాలి. నా కుటుంబానికి ఓ సిద్ధాంతం, భావజాలం ఉన్నాయి. వరుణ్ మరొకదానిని అనుసరిస్తున్నారు. నాకు దానితో సరిపడదు” అంటూ రాహుల్ పేర్కొన్నారు. మీడియా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. అయితే.. అది విలేకరుల తప్పు ఎంత మాత్రం కాదని, సంస్థ యాజమాన్యం ఎలా చెబితే.. అలా నడుచుకుంటారని రాహుల్ అన్నారు.












