నిజాం వారసునికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఇలా చేస్తే… తెలంగాణ పోరాట చరిత్రను, నిజాం వ్యతిరేక పోరాటం ప్రజలు చేసిన బలిదానాలను అవమానించడమే అవుతుందని వీహెచ్ పీ సహ కార్యదర్శి రావినూతల శశిధర్ అన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు హిందువులపై చేసిన మారణ హోమాన్ని ఎన్ని తరాలైనా మరిచిపోలేరని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ముర్ము ఓ వైపు నిజాం వ్యతిరేక పోరాటంలో త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటుంటే… సీఎం కేసీఆర్ మాత్రం నిజాం వారసుడికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడం తప్పని అన్నారు. ఓటు బ్యాంకు కోసం ఎంఐఎం ఆదేశాలను పాటిస్తూ తెలంగాణ ప్రజల త్యాగాలను కించపరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.