ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్… కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ తో మూడు సార్లు యుద్ధాలు చేసిన తర్వాత తాము గుణపాఠం నేర్చుకున్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. అంతేకాకుండా భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలన్నారు. అయితే… కశ్మీర్ లో జరుగుతున్న వాటిని మాత్రం ఆపాలంటూ రొటీన్ గా మాట్లాడారు. భారత్ తో తాము 3 సార్లు యుద్ధాలు చేశామని, వీటితో తమకు పేదరికం, నిరుద్యోగం మాత్రం మిగిలాయన్నారు.
అయితే.. భారత్ తో శాంతినే కోరుకుంటున్నామని, దీని ద్వారా తమ దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునే వీలుమాత్రం కలుగుతుందన్నారు. శాంతియుతంగా జీవించడం, పురోగతి సాధించడం, కలహించుకోకుండా వుండటం అనేది తమ బాధ్యత అని అన్నారు. తమ దగ్గర ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణ్యం వున్న ప్రజలున్నారని, అయితే… డెవలప్ మెంట్ కోసం ఈ వనరులను ఉపయోగించుకొని, అభివృద్ధి సాధించాలని అనుకుంటున్నామని అన్నారు. బాంబులు, మందుగుండు సామాగ్రి కోసం వనరులను వేస్ట్ చేయాలనుకోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.