కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్పతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ యేడాదిలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితిపై ప్రధాని మోదీ యడియూరప్పను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను బీజేపీ హైకమాండ్ తొలగించిన తర్వాత… ఆయన ప్రధాని మోదీతో భేటీ కావడం ఇదే ప్రథమం. అయితే.. కర్నాటక ముఖ్యమంత్రిని మార్చబోతున్నారని చాలా రోజులుగా పుకార్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
దక్షిణాదిలో బీజేపీకి బాగా పట్టున్న రాష్ట్రం కర్నాటక. ఈ ఒక్క రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలో వుంది. అందునా… యడియూరప్ప కర్నాటకను చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. లింగాయత్ సంఖ్య బాగా వుంటుంది. మాజీ సీఎం యడియూరప్ప లింగాయత్ వర్గీయులు. దీంతో వారి మద్దతు చాలా సంవత్సరాలుగా పార్టీకి వుంటూ వస్తోంది. అయితే… కర్నాటక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ యడియూరప్పను పక్కన పెట్టి, బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే.. కొన్ని రోజులుగా ప్రస్తుత సీఎం బొమ్మైపై ప్రతికూల వార్తలు వస్తున్నాయి. స్వయానా.. ఆయన కూడా పదవి నుంచి దిగిపోతానని రెండు, మూడు మార్లు పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు.