ఈ నెల 16 నుంచి 20 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2023లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం జ్యూరిచ్ చేరుకొని అక్కడినుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్తారు. సముద్ర మట్టానికి 1,560 మీటర్ల ఎత్తులో ఉన్న దావోస్‌లోని ఆల్పైన్ రిసార్ట్ టౌన్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్నది.
ఈ ఏడాది సదస్సును కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్‌మెంటెడ్ వరల్డ్ అనే థీమ్‌పై నిర్వహిస్తున్నారు. సదస్సులో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశం అవడంతోపాటు డబ్ల్యూఈఎఫ్ ఏర్పాటుచేస్తున్న వివిధ బృంద చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణ బృందంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఆటోమోటివ్ విభాగం డైరెక్టర్ గోపాల్ కృష్ణన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు ఉన్నారు.