తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఈ నెల 18 న కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. మొదటి విడత కంటే రెండో విడతల మరింత మంది కంటి పరీక్షలు చేసేలా చూడాలని, మన రికార్డులను మనమే బద్దలు కొట్టాలని సీఎస్ సూచించారు. ఇప్పటికే 15లక్షలకుపైగా కళ్లద్దాలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు, అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.







