ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ అయిన ఎంవీ గంగా విలాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారణాసిలో టెంట్ సిటీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు.గంగావిలాస్ ప్రారంభం పర్యాటక రంగంలో కొత్త యుగానికి నాంది పలుకుతుందని మోదీ చెప్పారు. గంగా నదిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ ప్రారంభం కావడం ఒక మైలురాయి అని ప్రధాని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో పర్యాటక రంగానికి కొత్త యుగానికి నాంది పలుకుతుందని మోదీ నొక్కి చెప్పారు. భారత్‌లో మీరు ఊహించగలిగేవన్నీ ఉన్నాయని, ఇది మీ ఊహకు మించినదని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. భారతదేశాన్ని మాటల్లో నిర్వచించలేమన్న ఆయన… దీన్ని మన మనసు ద్వారానే అనుభూతి చెందగలమని పర్యాటకులకు ప్రధాని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర కేంద్ర మంత్రులు, పలు శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

విలాసవంతమైన క్రూయిజ్ వారణాసి నుంచి భారత్, బంగ్లాదేశ్‌లోని ఐదు రాష్ట్రాల్లోని 27 నదీ వ్యవస్థల మీదుగా 3,200 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. రవిదాస్ ఘాట్ నుంచి 31 మంది ప్రయాణికులతో 50 ప్రదేశాలలో 51 గంటల తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ క్రూయిజ్ పేరు ఎంవీ గంగా విలాస్. ఇందులో మూడు డెక్‌లు, 36 మంది ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిన 18 సూట్లు ఉన్నాయి. క్రూయిజ్‌లో జిమ్, స్పా సెంటర్, లైబ్రరీ, ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి.
మొదటి ప్రయాణంలో స్విట్జర్లాండ్, జర్మనీ నుంచి 31 మంది ప్రయాణికుల బృందం క్రూయిజ్ ఎక్కింది. ఓడలోని 40 మంది సిబ్బందితో ప్రయాణాన్ని ప్రారంభించనుంది. క్రూయిజ్ షిప్ ఛైర్మన్ రాజ్ సింగ్ ఈ క్రూయిజ్ 27 నదీ వ్యవస్థల గుండా వెళుతుందని, బంగ్లాదేశ్‌తో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని చెప్పారు.












