ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందడం అవసరమా? పొత్తులపై పవన్ సంకేతాలు

జనసేన అధినేత పొత్తులపై రణస్థలం వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బలమైన శత్రువుతో పోరాడే సమయంలో ఇష్టమున్నా… లేకపోయినా.. కొందరితో కలిసి వెళ్లాల్సి వుంటుందని వ్యాఖ్యానించారు. తమ గౌరవం, కార్యకర్తల గౌరవం ఏమాత్రం తగ్గిపోకుండానే.. ముందుకు సాగుతామని, ఆత్మ గౌరవానికి ఇబ్బందులు వస్తే మాత్రం… ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలంతా తమకు మద్దతిస్తే ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందడం అవసరమా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు మాత్రం అందరూ తన వద్దే వుంటారని, ఎన్నికల సమయంలో మాత్రం కులం వాడు అంటూ వెళ్లిపోతారని అన్నారు. అధికారం ఇస్తే సేవకుడిలా వుంటానని, లేకపోతే.. నిలబడతానని పవన్ ప్రకటించారు. అన్ని కులాలకు ఎలా గౌరవం ఇస్తానో… తన కాపు కులానికి కూడా అంతే గౌరవం ఇస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని, ఒంటరిగా వెళ్లేందుకు తాను సిద్ధమేనని, భయపడే వ్యక్తిని మాత్రం కాదని పవన్ ప్రకటించారు.

తాము అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర వలసలు ఆపుతామని, పరిశ్రమలు తీసుకొస్తామని ప్రకటించారు. వలసలు అన్న మాటపోయి.. ఆర్థిక రాజధాని చేస్తామని హామీ ఇచ్చారు. ఇక… ఉపన్యాసం తర్వాత జానపద కళాకారులతో కలిసి పవన్ స్టేజీపైనే డ్యాన్స్ చేశారు. ఇప్పటి వరకూ తాను సాధించిన దానికి ఏమాత్రం సంతోషంగా లేనని, యువత బంగారు భవిష్యత్ కోసం పనిచేస్తానని పవన్ ప్రకటించారు.

 

Related Posts

Latest News Updates