జేడీయూ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (75) గురువారం రాత్రి కన్నుమూశారు. నివాసంలోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు అత్యవసర చికిత్స అందించినా… లాభం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబీకులు ప్రకటించారు. గురువారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. శరద్ యాదవ్ కి భార్య, ఓ కుమారుడు, కుమార్తె వున్నారు. 7 సార్లు లోక్ సభకు, 3 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003 లో జేడీయూ ఆవిర్భావం తర్వాత మొదటి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2016 వరకూ ఆ పదవిలో కొనసాగారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. శరద్ యాదవ్ మరణంపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీహార్ సీఎం నితీశ్, బీజేపీ నేతలు, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులు సంతాపం ప్రకటించారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆయన అనేక సేవలు అందించారని, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు ప్రభావితం చేశాయని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే శరద్ యాదవ్ విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పోరాడారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు.












