ఏపీలో జీవో నెంబర్ 1 అత్యంత దుమారం రేపుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను జగన్ ప్రభుత్వం తెచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీవో నెంబర్ 1 ని సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ నెల 23 వ తేదీ వరకూ జీవో నెంబర్ 1 ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జీవో నెం.1 ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం కోర్టులో విచారణ జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం జీవో నెం.1 ని తెచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు. జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా వుందని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఈ నెల 20 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది.












