ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తలపెట్టిన ఆవిర్భావ సభకు ఆ పార్టీ భారీ ఏర్పాట్లే చేస్తోంది. ఈ నెల 18 న నిర్వహించ తలపెట్టిన సభ నిర్వహణా బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీశ్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఖమ్మం చేరుకున్నారు. సభ తలపెట్టిన గ్రౌండ్స్ ను మంత్రి అజయ్, ఎంపీ నామా, ఎమ్మెల్సీ పల్లాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రూట్ మ్యాప్ ను పరిశీలించారు. అధికారులకు, నేతలకు పలు సూచనలు చేశారు. బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరానుండటంతో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని, ట్రాఫిక్ అవాంతరాలు కలుగకుండా తగినంత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. బహిరంగ సభ కలెక్టరేట్‌కు సమీపంలోనే ఉండటంతో కార్యాలయ ఉద్యోగులతో సీఎం ప్రత్యేక సమావేశం ఉండదని, వారి వద్దకే సీఎం విచ్చేస్తారని చెప్పారు.
కలెక్టరేట్ ప్రాంగణాన్ని కలియ తిరిగిన మంత్రులు కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబువుతున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్లీలు, గులాబీ జెండాలతో తయారవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు తదితర కాంగ్రెస్, బీజేపీయేతర నేతలు సభకు హాజరుకానుండటంతో పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.