తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీఎస్ సోమేశ్ కుమార్ ను విధుల నుంచి రిలీవ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సోమేశ్ ను ఏపీకి కేటాయిస్తూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే… ఏపీకి వెళ్లేందుకు సోమేశ్ కుమార్ ఏమాత్రం సుముఖంగా లేరని సమాచారం. అయితే… సోమేశ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ తెలంగాణ సర్కార్ జీవో ఇవ్వాల్సి వుంది. అంతకు ముందు సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు.
మరోవైపు కొత్త సీఎస్ ఎవరన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు తీర్పు విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, సోమేశ్ కుమార్ గానీ లేరని సమాచారం. అయితే… వీఆర్ఎస్ తీసుకునే యోచనలో సోమేశ్ వున్నట్లు సమాచారం. ఏపీకి వెళ్లేందుకు ఆయన ఏమాత్రం సుముఖత చూపించడం లేదని తెలుస్తోంది.