సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ సమక్షంలో సెస్ నూతన చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్ చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకూ చూసింది ట్రైలర్ మాత్రమేనని, 2023 లో అసలు సినిమా చూపిస్తామని బీజేపీకి సవాల్ విసిరారు. సెస్‌లో గెలువలేనోడు రాష్ట్రంలో గెలుస్తారా? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్ల అభివృద్ధిలో దేశం మొత్తంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్రం నిధులపై తన సవాల్ కు ఇప్పటికీ కట్టుబడే వున్నానని ప్రకటించారు. వేములవాడకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, అలాంటి వ్యక్తిని దేవుడంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికి దేవుడు..? నీకా? గుజరాత్ కా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని నిలదీశారు. కర్నాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవ నడుస్తోందని, రెండు బీజేపీ ప్రభుత్వాలేనని అయినా… మోదీ గొడవను పరిష్కరించ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర, కర్నాటక మధ్య గొడవలను ఆపలేని మోదీ… రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారా? అంటూ చురకలంటించారు.