భారత రాష్ట్ర సమితిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమలో కంటెంట్ వుంది కాబట్టే తాము పాన్ ఇండియాకి వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కంటెంట్ వున్న తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నప్పుడు సత్తా గల నాయకుడు కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లడం తప్పేముంది? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో దర్శకుడు దశరథ్‌ రచించిన ‘కథా రచన’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముద్రించింది.

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తక తొలి ప్రతిని ఆవిష్కరించారు. స్క్రిప్ట్‌ బాగున్న చిత్రాలే ప్రేక్షకాదరణ పొందుతాయని,శివ, అర్జున్ రెడ్డి, మహానటి లాంటి చిత్రాలు చూసినప్పుడు గొప్ప అనుభూతికి లోనయ్యానని అన్నారు. తనకు క్రియేటివ్‌ కంటెంట్‌ అంటే ఇష్టమని, తెలుగు, ఇంగ్లీష్‌, బిజినెస్‌ ఇలా రోజూ కనీసం పదీ పన్నెండు దిన పత్రికలు చదువుతానని మంత్రి వెల్లడించారు.

ఇప్పుడు దేశంలో తెలుగు సినిమా హవా నడుస్తున్నదని, కొద్ది రోజుల్లోనే దేశానికే కాదు దక్షిణాసియా మొత్తానికి హైదరాబాద్‌ ఫిలిం హబ్‌గా మారబోతున్నదని మంత్రి కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఏర్పాటు చేసేందుకు చిత్ర పరిశ్రమ సహకారం తీసుకుంటామని తెలిపారు. తెర వెనక సినిమా కోసం పని చేసే ఎంతోమందికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని వివరించారు.

సాంస్కృతిక శాఖ వేరు.. సినిమా వేరు అనుకోవడం సరికాదని చూపిస్తూ ఈ పుస్తకాన్ని ప్రింట్‌ చేసిన తెలంగాణ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌కు అభినందనలు తెలిపారు. ఈ ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణలో అసాధ్యమనుకున్న ఎన్నో పనులు చేసి చూపించాం. కంటెంట్‌ ఉంటే ఏ సినిమా అయినా దేశవ్యాప్తంగా హిట్‌ అవుతుంది. నాయకుడైనా, పార్టీ అయినా విజయం సాధిస్తుంది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.