ప్రపంచ తెలుగు సమాఖ్య, హైదరాబాద్ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఏ.వి. కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, జానపద పాటల్లో పోటీలు నిర్వహించారు. 21 సంవత్సరాల లోపు వున్న వారు ఓ బ్యాచ్ గా, 21 ఏళ్లు పై బడిన వారిది మరో బ్యాచ్ కింద విడదీశారు. ఆ తర్వాత ముగ్గుల పోటీలు నిర్వహించారు. వీటితో పాటు కోలాటాలు, కర్రసాములు, హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, పిండివంటలు… ఇలా చాలా అద్భుతంగా కార్యక్రమ నిర్వహణ జరిగింది. డా. లింగా శ్రీనివాస్ గారి టీమ్ డప్పులు వాయిస్తూ, కోలాటాలు ఆడుతూ… జానపద గేయాలు పాడారు.

ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రాంతీయ కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి స్వాగతోపన్యాసం చేశారు. కేసీపీ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. వి.ఎల్. ఇందిరాదత్తు అధ్యక్షోపన్యాసం చేశారు. సంక్రాంతి సంబరాలు తెలుగు వారికి వారం ముందు నుంచే ప్రారంభమవుతాయని ఇందిరా దత్తు గుర్తు చేశారు. కుటుంబ సమేతంగా జరుపుకునే పండగ సంక్రాంతి అని, కార్యక్రమానికి వచ్చిన యువతను చూస్తుంటే.. సంప్రదాయాలు మరో పదికాలాల పాటు నిలుస్తాయన్న నమ్మకం కలిగిందన్నారు.

ఇక… ముఖ్య అతిథిగా వచ్చిన డా. అద్దంకి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎలాంటి పదాలనైనా తనలో ఇముడ్చుకునే శక్తి తెలుగు భాషకే వుందన్నారు. తెలుగులో వుండే చమత్కార పద్యాలు పిల్లల్లో తెలుగు పట్ల ఆసక్తి పెంచుతుందన్నారు. ఇక… మెట్రో రైల్ ఎండీ వీఎస్ రెడ్డి మాట్లాడుతూ… ప్రక్రుతితో మమేకమైన పండగ సంక్రాంతి అని అన్నారు. ధనిక దేశమంటే.. కార్లు కొనుక్కోవడం కాదని, అందరూ కలిసి మెలిసి ప్రయాణించడమే అని వివరించారు.

ఇక.. ఫ్రాన్స్ దేశస్థుడు డేనియల్ నేజర్స్ మాట్లాడుతూ… ప్రపంచంలో 90 శాతం మందికి తెలుగు భాష అనేది వుందని తెలియదని, దానిని తెలియజేసేందుకే ఫ్రాన్స్ దేశంలో జూన్ 22,23 తేదీల్లో తెలుగు మహా సభలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక.. తెలుగు యూనివర్శిటీ మాజీ కులపతి ఆవుల మంజులత మాట్లాడుతూ… గత 25 సంవత్సరాలుగా తెలుగు భాషపై పరిశోధన చేస్తూ, తెలుగును ప్రపంచమంతటా తెలియజేయాలన్న తపన డేనియల్ నేజర్స్ లో కనిపిస్తుందని అభినందించారు. చివరగా… ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం జరిగింది.