పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన నగరమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్‌ దాటిందన్నారు. ఐటీలో గత రెండేండ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతోందని, దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్‌ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు.ఐటీ రంగంలో ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నగరంలో ఉత్తరంవైపు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. వ్యాపారవేత్తలు హైదరాబాద్‌ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. తెలంగాణలో టీఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తామని వెల్లడించారు. మదేశానికి గర్వకారణమైన అంతరిక్ష పరిశోధనలలో పనిచేస్తున్న స్కై రూట్, ధ్రువ వంటి స్టార్ట్ అప్ లు హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయమని, అవి విజయవంతంగా వృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఇన్నోవేషన్ సిస్టం బలంగా ఉందని, త్వరలో మరిన్ని స్టార్ట్ అప్స్ విజయం సాధిస్తాయన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.