ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్ పట్టణాన్ని అక్కడి ప్రభుత్వం కుంగుతున్న పట్టణంగా ప్రకటించింది. ఇక్కడి కొన్ని ప్రాంతాలు నివాస యోగ్యానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పింది. విస్తరిస్తున్నాయని, మరో కిలోమీటర్‌కు పైగా వీటి ప్రభావం ఉంటుందని వెల్లడించింది. 19వేల జనాభా.. 4,500 ఇళ్లు, భవనాలు ఉన్న ఈ పట్టణంలో ఇప్పటి వరకు 610 ఇళ్లకు పగుళ్లు రాగా.. అత్యవసరంగా 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. జోషిమఠ్ పట్టణంలోని పలు హోటళ్లు, ఓ గురుద్వారా, రెండు కళాశాలల్లో వీరికి వసతి కల్పించామని, మరో 90 కుటుంబాలను విడతల వారీగా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తామని అధికారులు వెల్లడించారు. వీరి పునరావాసానికి గాను 1,500 మంది సామర్థ్యం ఉన్న ఐదు ప్రాంతాలను గుర్తించామని వివరించారు. ప్రమాదకరంగా మారిన ఇళ్లకు రెడ్‌మార్క్ వేశామన్నారు. పగుళ్లు తీవ్రంగా ఉండి.. ప్రమాదకరంగా మారిన ఇళ్లను కూల్చివేస్తామని ప్రకటించారు.

జోషిమఠ్ పరిస్థితిపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రధాని ముఖ్యకార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో కేబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా అధికారులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ సభ్యులు ఈ సమీక్షలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ అధికారులకు పీఎంవోకి ఓ రిపోర్టును కూడా సమర్పించారు. జోషిమఠ్‌లోని ఇతర నివాస ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా వెంటనే సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధ్యయనానికి కేంద్ర బృందం సోమవారం జోషిమఠ్‌ను సందర్శించనుంది.
మరోవైపు జోషి మఠ్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి, వివరాలు, పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. జోషిమఠ్ ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం పుష్కర్ ధామీ వెల్లడించారు.












