బ్రెజిల్ లో నానా బీభత్సం సృష్టించిన మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు… పార్లమెంట్ పై దాడి

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతు దారులు వందల సంఖ్యలో రాజధాని బ్రెసిలియాలో నానా విధ్వంసం చేశారు. బీభత్సం సృష్టించారు. పార్లమెంట్, సుప్రీంకోర్టుపై మెరుపు దాడికి దిగారు. 2021, డిసెంబర్‌లో అమెరికాలో జరిగిన యూఎస్‌ క్యాపిటల్‌ విధ్వంసం తరహాలో.. నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్‌పై దాడిచేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆకుపచ్చ, పసుపు దుస్తులు వేసుకుని రోడ్లపైకి వచ్చిన వందలాది మంది నిరసనకారులు నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్‌లోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారుల దాడిలో నేషనల్ కాంగ్రెస్ భవనం ధ్వంసమైంది. బిల్డింగ్‌పై ‘జోక్యం చేసుకోండి (ఇంటర్​వెన్షన్)’ అంటూ సైన్యాన్ని ఉద్దేశించి బ్యానర్లు ఎగరేశారు.

చట్టసభ్యుల కార్యాలయాల్లోకి చొరబడి నాశనం చేశారు. ఇప్పుడీ దాడి దృష్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లులా డా సిల్వా చేతిలో బోల్సనారో ఓడిపోయారు.అప్పటి నుంచి.. బోల్సనారో మద్దతుదారులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. కాగా, అత్యున్నత పరిపాలనా భవనాలపై దాడిఘటనపై అధ్యక్ష, మాజీ అధ్యక్షులు తీవ్రంగా ఖండిచారు. దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజుని, ఫాసిస్ట్‌లు చాలా తప్పు చేశారని అధ్యక్షుడు లూలా డా సిల్వా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా భవనాలపై జరిగిన దోపిడీ, దండయాత్రను ఖండిస్తున్నాని బోల్సొనారో అన్నారు.

బ్రెసిలియాలోని ప్రభుత్వ ఆస్తులపై దాడులు, అల్లర్ల వార్తల పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు వుంటుందని ట్వీట్ చేశారు. బ్రెసిలియాలోని ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అల్లర్ల వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. బ్రెజిలియన్ అధికారులకు మా పూర్తి మద్దతు వుంటుంది అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates