జల్లికట్టు పోటీలు నిర్వమించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.ప్రతి సంక్రాంతి సీజన్ లో తమిళనాట జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి సీజన్ ను పురస్కరించుకుని రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు జరుపనున్నారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జల్లికట్టు కోసం ప్రజల నుంచి డిమాండ్లు అధికమవుతుండడంతో, నూతన మార్గదర్శకాలతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈసారి జల్లికట్టు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతిని తప్పనిసరి చేసింది. తమిళనాడు పురాతన సంప్రదాయ క్రీడ జల్లికట్టు. బలమైన ఎద్దులను బరిలోకి వదిలి లొంగదీసుకోవడం ఈ క్రీడలో చూడొచ్చు. అందుకే జల్లికట్టు తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ క్రీడగా గుర్తింపు పొందింది. వాస్తవానికి జనవరి 1 నుంచి ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడంతో, ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది.
పోటీలో పాల్గొనే వారు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే జల్లికట్టులో ఆటగాళ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కో ఈవెంట్‌కు ఆటగాళ్ల సంఖ్య 150కి మించరాదని పేర్కొంది. వీక్షకుల సంఖ్య 50శాతం మించరాదని ఆంక్షలు విధించింది. సామాజిక దూరం, ప్రేక్షకులందరూ మాస్కులు ధరించాలని ఆదేశించింది.












