చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సృష్టికర్త జాక్‌మాకు మరో షాక్ తగిలింది. అలీబాబా అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ పై నియంత్రణ అధికారాన్ని కూడా కోల్పోనున్నారు. యాంట్ గ్రూప్ ఫౌండర్ కూడా జాక్‌మా నే కావడం గమనార్హం. రెండేండ్ల క్రితం ప్రభుత్వ పెద్దలపైనా, బ్యాంకింగ్ వ్యవస్థపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జాక్ మా కు నాటి నుంచి చిక్కులు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలకు కోపం తెప్పించినందుకు తాను స్థాపించిన ఫిన్‌టెక్ సంస్థ యాంట్ గ్రూప్‌పై నియంత్రణకు ఓటింగ్ హక్కులు కోల్పోనున్నారు. కంపెనీ వాటాదారులు యాంట్ గ్రూప్ ఓటింగ్ హక్కులను మార్చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ఫౌండర్, యాజమాన్యం, సిబ్బంది ఓటింగ్ హక్కుల్లో మార్పులు తీసుకొచ్చారు. తాజాగా యాంట్ గ్రూప్ వాటాదారులు తీసుకున్న నిర్ణయంతో సంస్థపై జాక్‌మా పట్టు కోల్పోనున్నారు. ఈ నిర్ణయం వల్ల సంస్థ వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని యాంట్ గ్రూప్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.












