తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, పోలింగ్ బూత్ కార్యకర్తలందరూ సమాయత్తంగా వుండాలన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ సభ్యులే ముఖ్యమన్నారు. సరల్ యాప్ ద్వారా కేంద్ర పథకాలు, బీజేపీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకెళ్ళామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా వున్న బీజేపీ బూత్ కమిటీ సభ్యుల కీలక సమావేశం జరిగింది. ఇందులో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల జాబితా నుంచి బీజేపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ బూత్ కార్యకర్తలందరూ ఓటర్ లిస్ట్ ను చెక్ చేసుకోవాలని, ఓట్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల పాత్ర వల్లే సాధ్యం అని ప్రకటించారు. బూత్ కమిటీ సభ్యుడు బీజేపీలో రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడు కూడా కావొచ్చని, ప్రధాని మోదీ కూడా బూత్ అధ్యక్షునిగా పనిచేశారని చెప్పుకొచ్చారు. సరల్ యాప్ ద్వారా కేంద్ర పథకాలు, బీజేపీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకెళ్ళామని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని.. రాజీనామా పత్రంతో కేసీఆర్ రెడీగా ఉండాలని అన్నారు. తెలంగాణలో పేదల రాజ్యం రావాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.