బదరీనాథ్ పుణ్యక్షేత్రానికి ముఖ ద్వారంగా భావించే జోషిమఠ్ లో ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగి పోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని తక్షణం రంగంలోకి దిగాలని శుక్రవారం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి సర్వే చేపడుతోంది.గార్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డిజాస్టర్ మేనేజిమెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు 561 ఇళ్లు బీటలు వారినట్టు ఛమోలీ జిల్లా యంత్రాంగం గుర్తించింది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద హోటల్ వ్యూ, మలరి ఇన్‌లో పర్యాటకులను రాకపోకలను నియంత్రించారు.

మంగళవారంనాడు తొమ్మిది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వీటిలో జోషిమఠ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన నాలుగు కుటుంబాలు, గురుద్వారా జోషిమఠ్‌కు చెందిన ఒక కుంటుంబం, టూరిస్ట్ హోటల్ నుంచి, మనోహర్ బాగ్, ఇతర ప్రాంతాలకు చెందిన కుటుంబాలు ఉన్నారు. ఇంతవరకు 38 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద నిర్మితం కావడం వల్లే జోషీమఠ్ క్రమంగా కుంగిపోతున్నదని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కలాచంద్ సైన్ తెలిపారు. దాదాపు వందేళ్ల క్రితం ఈ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయని, ఈ కొండచరియల శిథిలాల మీద జోషీమఠ్ నిర్మాణం జరిగిందని, అందుకే పట్టణ పునాదులు బలహీనంగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు.












